నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్(Armoor) నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు(KCR) సిట్ నోటీసులు(SIT notices)జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఊరేగింపుగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. మెడలో నల్ల కండువా ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు జీవన్ రెడ్డిని తోసేయడంతో కిందపడిపోయారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.