Rishabh Shetty | కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విశేష గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫోక్లర్, ఆధ్యాత్మికత, స్థానిక సంస్కృతి కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరిగింది. ‘కాంతార’ ఫ్రాంచైజీ విజయానంతరం ఆయన పేరు దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలు కూడా రిషబ్‌తో సినిమాలు చేయాలనే ఆసక్తి చూపుతున్నారు.ఇటీవల ఆయన తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలకు సంబంధించి రిషబ్ శెట్టి డిమాండ్ చేస్తున్న పారితోషికమే ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా స్టార్ హీరోలు లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తుండగా, రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు నేరుగా రూ.80 కోట్ల పారితోషికం కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భారీ ఫిగర్ నిర్మాతలను ఆలోచనలో పడేసిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిషబ్ శెట్టి తెలుగులో చేయబోయే ప్రాజెక్టుల్లో ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ‘జై హనుమాన్’ సినిమా ఒకటి. ఈ చిత్రం మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో గ్రాండ్ స్కేల్లో రూపొందనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామాలో కూడా రిషబ్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ హంటింగ్, టెక్నికల్ టీమ్ ఫైనలైజేషన్ వంటి పనులు జోరుగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ సమాచారం. ఈ ఏడాది పూర్తిగా ఈ రెండు ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇతర భాషల్లో వచ్చే కొత్త ఆఫర్లకు కూడా ప్రస్తుతం డేట్స్ ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.‘కాంతార’ తర్వాత రిషబ్ శెట్టికి ఏర్పడిన మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఆయన అడుగుతున్న పారితోషికం అతిశయోక్తి కాదని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రిస్కీ నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు చివరకు ఈ డిమాండ్‌ను అంగీకరిస్తారా? లేక లాభాల్లో వాటా పద్ధతినే కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.