‘మా సంస్థకు పేరును, డబ్బును తెచ్చిపెట్టిన సినిమా ‘సోగ్గాడు’. 1975లో విడుదలైన ఈ సినిమా శోభన్‌బాబు కెరీర్లోనే మరపురాని సినిమా. ఈ సినిమా సౌండ్‌కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి రీరిలీజ్ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐ లోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం.’ అన్నారు అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు. స్వర్గీయ నటుడు నటభూషణ శోభన్‌బాబు కథానాయకుడిగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేశ్‌ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన శతదినోత్సవ చిత్రరాజం ‘సోగ్గాడు’. ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకున్నది. అఖిలభారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు.
అదేరోజున ‘సోగ్గాడు’ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ రీరిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సురేశ్‌బాబు మాట్లాడారు. ఇంకా మురళీమోహన్, కైకాల నాగేశ్వరరావు, అట్లూరి పూర్ణచంద్రరావు, కె.ఎస్.రామారావు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రేలంగి నరసింహారావు, రాశీమూవీస్ నరసింహారావు, కె.మురళీమోహన్రావు, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేశ్‌బాబు, అఖిలభారత శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.