Sobhita Dhulipala | హీరోయిన్ శోభిత ధూళిపాళ 2024 డిసెంబర్లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ కెరీర్ పరంగా కూడా శోభితపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె చాలా రోజుల తర్వాత తెలుగులో నటించిన తాజా చిత్రం ‘చీకటిలో’ నేరుగా ఓటీటీకి రావడం విశేషంగా మారింది. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా శోభిత పలు మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూల్లో తన కొత్త జీవితం, కుటుంబం, పండుగలు, అలాగే నాగచైతన్యతో ఉన్న బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఒక ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ, “నాకు భోగి పండగ అంటే చాలా ఇష్టం. పాత వస్తువులన్నీ కలెక్ట్ చేసి తెల్లవారుజామున మంట వేయడం, అందరూ కలిసి ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ముంబైలో ఉన్నా కూడా ప్రతి ఏడాది వైజాగ్‌కి వచ్చి మా ఇంట్లో భోగిని గ్రాండ్‌గా చేసుకునేదాన్ని” అని చెప్పింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని, పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని అక్కినేని కుటుంబంతో కలిసి జరుపుకున్నామని వెల్లడించింది. “ఈసారి భోగి, సంక్రాంతి అక్కినేని ఇంట్లోనే చేసాం. మా పేరెంట్స్ కూడా అక్కడికే వచ్చారు. తర్వాత మొదటి సంక్రాంతి సందర్భంగా మేము వైజాగ్ వెళ్లాం” అంటూ ఆ అనుభూతిని వివరించింది.
నాగచైతన్యతో తన రిలేషన్‌షిప్‌పై కూడా శోభిత ఓపెన్‌గా మాట్లాడింది. “మేమిద్దరం సినిమాల గురించి మాట్లాడుకుంటాం కానీ, మా సినిమాల గురించి మాత్రం ఎక్కువగా చర్చించం. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, సినిమాలు ఎలా మారుతున్నాయి అనే విషయాలపై మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడూ చైతన్య దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను అంతే. కానీ నా కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు మాత్రం నేనే తీసుకుంటాను. మొదట్నుంచి నాకు నచ్చిన మార్గంలోనే ముందుకు వెళ్తున్నాను” అని స్పష్టం చేసింది. ఇటు వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టిన శోభిత, అటు ప్రొఫెషనల్‌గా ‘చీకటిలో’ వంటి సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఆమెకు తొలి తెలుగు ఓటీటీ విడుదల కావడం కూడా ప్రత్యేకతగా నిలుస్తోంది. మరి పెళ్లి తర్వాత శోభిత కెరీర్‌కు ఈ సినిమా ఎంతవరకు మైలురాయిగా మారుతుందో చూడాలి.