Sobhita Dhulipala | తెలుగమ్మాయే అయినా తన అందం, అభినయంతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ్ల మరోసారి వార్తల్లో నిలిచింది. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శోభిత, ఇటీవల అక్కినేని యువ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొద్దికాలం గ్యాప్ తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సూపర్ హిట్ మూవీ ‘ధురంధర్’ పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. “వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. మిగతా వాటిలా కాదు. సుప్రీమ్!! ఆదిత్య, రణ్వీర్ అదరగొట్టారు.. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఏం అందం” అంటూ శోభిత తన స్టోరీలో రాసుకొచ్చింది. చివరగా సెల్యూట్, నమస్కారం, హార్ట్ సింబల్స్ ఎమోజీలను జోడించి తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.ఈ స్టోరీ వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు శోభిత అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు “క్లాస్ టేస్ట్ ఉన్న రివ్యూ” అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు ధురంధర్ సక్సెస్‌పై శోభిత మాటలు మరింత హైప్ తెచ్చాయని అభిప్రాయపడుతున్నారు.
ఇక ‘ధురంధర్’ సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఆల్ టైమ్ ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్ట్‌లో టాప్ 9 స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ ఊపులో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ధురంధర్ 2 చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.