తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన శైలికి భిన్నంగా విభిన్నమైన కథతో పూరీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ఉపశీర్షిక. పూరి కనెక్ట్స్, జెబి మోహన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. శుక్రవారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి వైల్డ్ అవతారంలో కనిపిస్తున్నారు. ఓ గూడౌన్లో చెక్క పెట్టెల నిండా నోట్ల కట్టలు.. మరోవైపు చెల్లాచెదరుగా పడివున్న కరెన్సీ నోట్లు.. వీటిమధ్య రక్తసిక్తమైన పెద్ద కత్తి పట్టుకొని, నల్ల కళ్లజోడు ధరించి, చిత్రమైన వస్త్రధారణలో ఉన్న విజయ్ సేతుపతిని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఇందులో మునుపెన్నడూ చూడని అవతారంలో విజయ్ సేతుపతి కనిపిస్తారని, ఆయన కెరీర్లోనే భిన్నమైన పాత్రను ఇందులో పోషించారని మేకర్స్ తెలిపారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ కీలక పాత్రధారులు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.