SKN | ఈ మధ్య సినీ ఈవెంట్లలో సెలబ్రెటీలు మాట్లాడే మాటలే పెద్ద కాంట్రవర్సీలకు కారణమవుతున్నాయి. స్టేజ్‌పై భావోద్వేగంతో లేదంటే ఉత్సాహంతో పలువురు నటులు, నిర్మాతలు మాట్లాడే మాటలు విమర్శలకి కారణమవుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన సినిమా మాఫియా గురించి బహిరంగంగా మాట్లాడడమే కాకుండా, మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఈవెంట్లోనే నిర్మాత బన్నీ వాసు కౌంటర్ ఇవ్వడంతో గణేష్ మనస్తాపానికి గురయ్యారు. తరువాత ‘మిత్రమండలి’ సినిమా సందర్భంగా బన్నీ వాసుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
ఇక ‘కె ర్యాంప్’ మూవీ ఈవెంట్లో బండ్ల గణేష్ మాటలు దుమారం రేపాయి. “కొంతమంది ఒకట్రెండు హిట్లు కొట్టగానే లూసు ఫ్యాంట్లు, కళ్లజోడు, వెరైటీ చెప్పులు వేసుకుని వాట్సాప్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తారు” అంటూ విజయ్ దేవరకొండని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. గణేష్ తర్వాత తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని వివరణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో, రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్లో ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ .. రాజు అప్పుడప్పుడూ కనిపించకపోవచ్చు కానీ ప్రిన్స్ ప్రిన్సే. సింహం అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహమే. విజయ్ పడే కష్టమేంటో నాకు తెలుసు. 6–9 నెలల్లో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడు. ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే ఫేక్ అంటారు, మూడోసారి కొడితే దాన్ని ఇండస్ట్రీ షేక్ అంటారు,” అని విజయ్‌ని ప్రశంసించారు.ఈ వ్యాఖ్యలు బండ్ల గణేష్ చేసిన కామెంట్లకు ప్రత్యుత్తరంగా ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో ‘తెలుసు కదా’ సక్సెస్ మీట్ సందర్భంగా ఎస్కేఎన్, బండ్ల గణేష్‌ని ఆకాశానికెత్తగా ఇప్పుడు అదే వ్యక్తిపై పరోక్షంగా వ్యాఖ్యానించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై కొందరు నెటిజన్స్.. మొన్నటి వరకూ పొగిడావు, ఇప్పుడు విజయ్ మెప్పు కోసం టార్గెట్ చేస్తున్నావా? అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, బండ్ల గణేష్ – ఎస్కేఎన్ – విజయ్ దేవరకొండ త్రయం చుట్టూ తిరుగుతున్న ఈ మాటల యుద్ధం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.