గత కొంతకాలంగా నటనకే ప్రాధాన్యతనిస్తున్నారు ఎస్.జె.సూర్య. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిల్లర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్, ఎస్.జె.సూర్య స్వీయ నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
‘భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఐదు భాషల్లో విడుదల చేస్తాం. ఈ సినిమాలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగమవుతారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వాలి’ ‘ఖుషి’ ‘న్యూ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఎస్.జె.సూర్య. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.