1986లో అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ఆరు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఒకే ఏడాది వరుసగా ఆరు హిట్స్ అనమాట. ఆయన సమకాలీనుల్లో కానీ, ఆ తర్వాత వచ్చిన హీరోల్లో కానీ.. ఎవరికీ లేని రికార్డ్ ఇది. మళ్లీ 39ఏండ్ల తర్వాత అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ఒకే ఏడాది కాకపోయినా.. ఇప్పటికే వరుసగా నాలుగు హిట్స్‌ని అందుకున్నారు బాలయ్య. అయిదో నంబర్‌గా ‘అఖండ 2 – తాండవం’ వచ్చేస్తోంది. ఆ సినిమాకున్న హైప్‌ను బట్టి, దాదాపుగా విజయం ఖరారనిపిస్తున్నది.
ఇక అసలైన అగ్నిపరీక్ష మలినేని గోపీచంద్‌కే. ఎందుకంటే ‘అఖండ 2’ విజయం ఖరారైతే.. ఆ వరుసలో వచ్చే ఆరో సినిమా మలినేనిదే అవుతుంది. మొత్తంగా బాలకృష్ణతో రెండోసారి సిక్సర్ కొట్టించే బాధ్యత మలినేని గోపీచంద్ చేతిలో ఉందన్నమాట. అందుకే.. స్క్రిప్ట్ విషయంలో పకడ్బందీగా ముందుకెళ్తున్నారట మలినేని గోపీచంద్. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ వర్కంతా పూర్తయిందని సమాచారం. ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.
ఆద్యంతం ఎమోషన్స్‌తో ఈ కథ సాగుతుందట. ద్వితీయార్ధంలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు, ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని తెలిసింది. ద్వితీయార్ధంలోనే బాలయ్య పాత్రపై ఓ మెమొరబుల్ ఫ్లాష్‌బ్యాక్‌ను ప్లాన్ చేశారట మలినేని గోపీచంద్. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలకృష్ణ మాఫియా డాన్‌లా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా గురించి రీసెంట్గా మలినేని గోపీచంద్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి సింహగర్జన మరింత గట్టిగా ఉండబోతోంది.. చరిత్రలో నిలిచుండే సినిమా రాబోతున్నది.. వెయిట్ అండ్ సీ.. ’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. బాలకృష్ణ 111వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు.