ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్-2’పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్టీఆర్ తొలి స్ట్రెయిట్ హిందీ చిత్రమిదే కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత అంచనాల్ని పెంచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ‘దేవర’ చిత్రాలను సితార ఎంటర్టైన్మెంట్ విడుదల చేసింది. ‘వార్-2’తో తాము హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. ‘ఆగస్ట్ 14న థియేటర్లలో ఓ ఉత్సవం మొదలుకానుంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య పోటాపోటీ నటన విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది’ అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలకానుంది.