కొత్త చిత్రాల రిలీజ్లు లేకపోవడం, ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. పదిరోజుల పాటు థియేటర్లను మూసివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అపెక్స్ బాడీస్ అయిన తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
‘ఈ విషయంలో థియేటర్ యాజమాన్యాలు అపెక్స్ బాడీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో అపెక్స్ బాడీకి ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. థియేటర్ల బంద్ యాజమాన్యాల వ్యక్తిగత నిర్ణయమని, దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, సెక్రటరీ కె.అనుపమ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.