Singer KK | ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ బుధవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ కాన్సర్ట్‌లో పాటలు పాడిన కేకే ఇబ్బందిపడగా.. ఆ తర్వాత ఈవెంట్‌ను ముగించుకొని హోటల్‌కు చేరిన తర్వాత కుప్పకూలిపోయారు. ఆ తర్వాత హాస్పిటల్‌కు తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేకే ఆగస్ట్ 23న, 1968 న్యూఢిల్లీలో సీఎస్ మీనన్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించారు. ఆయన ఢిల్లీ మౌంట్ సెయింట్ మెరీస్ స్కూల్లో విద్యనభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం ఆ తర్వాత కేకే హోటల్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ అసోసియేట్‌గా కొద్దికాలం పని చేశారు. ఆ తర్వాత సంగీతంపై మక్కువతో ముంబైకి మకాం మార్చాడు.
కేకేపై కిశోర్‌కుమార్, ఆర్డీ బర్మన్ ప్రభావం చూపారు. అలాగే మైఖేల్ జాక్స్, బీ జోయెల్, బ్రయాన్ ఆడమ్స్, లెడ్ జెప్పెలిన్ కేకే అభిమాన గాయకులు. 1996లో తమిళంలో వచ్చిన ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన కాదల్ దేశం (తెలుగులో ప్రేమ దేశం) చిత్రంతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో ‘కల్లూరి సలై’, హలో డాక్టర్’ పాటలు పాడారు. తెలుగులో ‘కాలేజీ స్టైలే’.. హలో డాక్టర్’ పాటలను సైతం ఆలపించగా.. సూపర్ హిటయ్యాయి. 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలో ‘తడప్ తడప్’తో బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశాడు. అయితే, దీనికి ముందు గుల్జార్ ‘మాచిస్’లోని ‘ఛోడ్ ఆయే హమ్’ పాటలో కొంత భాగాన్ని పాడాడు.
అదే సంవత్సరంలో లెస్లీ లూయిస్ సంగీతం సమకూర్చిన ‘పాల్’ పేరుతో తన తొలిసోలో ఆల్బమ్‌ను విడుదల చేశారు. 1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో భారత క్రికెట్ జట్టు మద్దతు కోసం ‘జోష్ ఆఫ్ ఇండియా’ పాటలోనూ కేకే కనిపించాడు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో కేకే హిందీలో దాదాపు 500కుపైగా, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ దాదాపు 200కుపైగా పాటలను పాడాడు. కెరీర్లో ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న కేకే తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతికృష్ణను 1991లో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి నకుల్, తామర అనే ఇద్దరు పిల్లలున్నారు. కెరీర్లో ఎన్నో హిట్ సాంగ్స్‌ను ఆలపించి ఎంతో మంది సంగీత అభిమానుల మన్నలు పొందిన కృష్ణకుమార్ కున్నత్ చివరి శ్వాస వరకు పాటలు పాడాడు.
కేకే తెలుగులో సూపర్ హిట్స్ సాంగ్స్కృష్ణకుమార్ కున్నత్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్ పాటలు ఆలపించగా.. రెండు సూపర్ హిట్టయ్యాయి. ఇంద్ర, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్, నువ్వేనువ్వే, సైనికుడు సినిమాలతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇంద్ర చిత్రంలో ‘దాయి దాయి దామ్మా’, నువ్వే నువ్వే చిత్రంలో ‘ఐ ఆమ్ వెరీ సారీ’, ఘర్షణలో ‘చెలియ చెలియ’, వాసులో ‘పాటకు ప్రాణం’, ఖుషిలో ‘యే మేరా జహ’, నువ్వు నేను చిత్రంలో ‘నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన’, నా ఆటోగ్రాఫ్ చిత్రంలో ‘గుర్తుకొస్తున్నాయి’, ఆర్యలో ‘ఫీల్ మై లవ్’, ‘జల్సా’లో మై హార్ట్ ఈజ్ బీటింగ్’, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ప్రేమకావాలి’లో ‘మనసంతా ముక్కలు చేసి’ తదితర ఎన్నో తెలుగు హిట్ పాటలను కేకే ఆలపించారు. ఆయన మృతికి పలువురు తెలుగు సంగీత దర్శకులు సంతాపం ప్రకటించారు.