Chinmayi | భారతీయ సంగీత ప్రియులకు మంగళవారం (జనవరి 27) అనుకోని షాక్ తగిలింది. ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరైన అరిజిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ తీసుకోబోనని స్పష్టం చేయడంతో ఈ వార్త సంగీత ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటనపై అభిమానులు, సంగీతకారులు, గాయకులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరిజిత్‌తో కలిసి పలు హిట్ పాటలు పాడిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అరిజిత్ సింగ్‌తో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన పోస్ట్ సంగీత ప్రేమికులను మరింత భావోద్వేగానికి గురిచేసింది.
చిన్మయి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్పందిస్తూ, ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ సమయంలో తొలిసారి అరిజిత్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికి ‘తుమ్ హి హో’ విడుదల కాకముందే అతను పరిశ్రమను శాసిస్తాడన్న అంచనాలు ఎవరికీ లేకపోయినా, అరిజిత్లో మాత్రం అసాధారణమైన నిబద్ధత, వినయం కనిపించిందని ఆమె పేర్కొన్నారు. స్టార్ సింగర్‌గా ఎదిగిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని చిన్మయి ప్రశంసించారు. అరిజిత్ గురించి మరింతగా ఎమోషనల్‌గా మాట్లాడిన చిన్మయి .. “అతను నా ఫేవరెట్ గాయకుల్లో ఒకడు మాత్రమే కాదు… నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకడు. సంగీతాన్ని అతను చూసే విధానం, ప్లాన్ చేసుకునే తీరులో ఏదో దైవికత ఉంటుంది. ఎప్పుడూ అత్యున్నత స్థాయినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశాడు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
చిన్మయి చేసిన ఈ పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఓ యూజర్ మీరు ఓ పురుషుడి గురించి ఇలా మంచి మాటలు చెప్పడం బాగుంది అని కామెంట్ చేయగా, దానికి ఆమె ఇచ్చిన సమాధానం మరోసారి చర్చకు దారి తీసింది. తన జీవితంలో కలిసిన చాలా మంది మగవాళ్లు మంచివారేనని, కానీ సోషల్ మీడియాలో మాత్రం ద్వేషం ఎక్కువగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. చిన్మయి, అరిజిత్ సింగ్ కలిసి పాడిన పాటలు బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజిక్కు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. 2 స్టేట్స్ నుంచి ‘మాస్ట్ మగన్’, రంగీలా నుంచి ‘సూయీన్ సి’, డోంగ్రి కా రాజా నుంచి ‘పియా తు పియా’, ఈ పాటలు ఇప్పటికీ సంగీత ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాయి.