Sing Geetham | ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’ జూన్ 12న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌తో నడుస్తుంది. అయితే ఈ సినిమా ఓటీటీపై తాజాగా స్పందించాడు చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ థియేటర్ వెర్షన్ కంటే భిన్నంగా ఉండబోతుందని నాగ్ అశ్విన్ తెలిపారు.
క్లైమాక్స్‌లోని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని అనిపించిందని, డిజిటల్ విడుదలకు ముందు సీజీని మరింత మెరుగుపరచాలని తమ బృందం యోచిస్తోందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులు డిజిటల్ వేదికగా ఆదరిస్తారని, అందుకే భవిష్యత్తు రోజులకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కథానాయకుడు విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించినట్లు సమాచారం అయినప్పటికీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తుండటంతో ఓటీటీలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.