బాలీవుడ్లో మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నది. అగ్ర కథానాయిక కియారా అద్వాణీ గత కొంతకాలంగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రేమికుల జోడీ వివాహ వేదిక అన్వేషణలో ఉన్నట్లు తెలిసింది. తొలుత గోవాలోని ప్రముఖ రిసార్ట్లో పెళ్లి చేసుకోవాలని భావించినా..ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు.
చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో వివాహం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో చివరకు చండీఘర్ను ఖరారు చేశారని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో పెళ్లికి ముహూర్తం కుదిరిందని చెబుతున్నారు. ‘షేర్షా’ చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో కియారా అద్వాణీ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది.