Siddu Jonnalagadda | డీజే టిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో ఓ మహిళా జర్నలిస్ట్ సిద్ధును ఉద్దేశించి ..“రియల్ లైఫ్‌లో మీరు ఉమనైజరా?” అని ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారి తీసింది.
మంగళవారం జరిగిన ప్రెస్మీట్లో ఈ అంశంపై స్పందించిన సిద్ధు జొన్నలగడ్డ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..“ఎలా స్పందించాలో అప్పుడు నాకు అర్థం కాలేదు. అలాంటి ప్రశ్నలు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించాయి. చేతిలో మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు. సినిమాలో అండర్‌కవర్ పోలీస్‌గా నటిస్తే, నిజ జీవితంలో కూడా అలానే ఉంటానా? సినిమాలో డ్రగ్ అడిక్ట్ పాత్ర చేస్తే, బయట కూడా అలాంటివాడినేనా? ఇవన్నీ సినిమాలు కదా. ఇష్టం వచ్చినట్లు అడగడం కరెక్ట్ కాదు,” అని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఆ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ… ఆమె ఐదు నిమిషాల ముందే మా టీమ్‌కి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. కానీ కొద్దిసేపటికే ఇలాంటి ప్రశ్న అడిగారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు కాబట్టి, హీరో అన్నిటికీ సమాధానం చెప్పాలి అనుకునే విధానం సరికాదు అని వ్యాఖ్యానించారు. సిద్ధు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. చాలా మంది నెటిజన్లు ఆయన స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరి కొంతమంది జర్నలిజం ఎథిక్స్‌పై చర్చను మొదలుపెట్టారు. ‘తెలుసు కదా’ చిత్రంలో సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.