సినిమా పేరు: తెలుసు కదా
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి, వైవా హర్ష..
దర్శకత్వం: నీరజా కోనా
డీవోపీ: జ్ఞానశేఖర్
సంగీతం: తమన్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
అందమైన హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి.. జోష్‌ఫుల్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. భారీ నిర్మాణ సంస్థ.. వీటన్నింటితోపాటు తమన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు.. ముఖ్యంగా ‘మల్లిక గంధా..’ సాంగ్.. ఇవన్నీ ‘తెలుసు కదా’పై విడుదలకు ముందే అంచనాలు పెంచాయి. స్టార్ క్యాస్టూమ్ డిజైనర్ కోనా నీరజా ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కావడం ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయం. ఎట్టకేలకు ఈ దీపావళి కానుకగా భారీ కాంపిటేషన్ నడుమ ‘తెలుసు కదా’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ సినిమా అందరి అంచనాలనూ నిజం చేసిందా? అందరికీ నచ్చేలా కోనా నీరజా ఈ సినిమా తీసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం.
కథ
వరుణ్(సిద్ధు జొన్నలగడ్డ) అనాధగా పెరిగి, ఆర్ధికంగా ఎదిగిన కుర్రాడు. తనకంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనే కలలుకంటూ ఉంటాడు. ఈ ప్రయత్నంలోనే ఓ అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ కొన్ని కారణాలవల్ల అది బ్రేక్ అప్ అవుతుంది. దాంతో మానసికంగా డిస్ట్రబ్ అవుతాడు. మళ్లీ కొత్త లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా అంజలి(రాశీఖన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అంతలో ఊహించని ట్విస్ట్.. అంజలి గర్భసంచిలో సమస్య ఉన్న కారణంగా తను బిడ్డను మోయలేదని డాక్టర్లు తేల్చేస్తారు. కుటుంబం కోసం తపించే వరుణ్ ఈ వార్తను భరించలేకపోతాడు. అంజలి వేరే మార్గాలను అన్వేషించే క్రమంలో డాక్టర్ రాగా(శ్రీనిధి)ని కలుస్తుంది. తమ బిడ్డనే మరొక స్త్రీ గర్భం ద్వారా సరోగసీ విధానంతో పొందవచ్చని తెలుసుకుంటుంది. తమ బిడ్డను మోసేందుకు సహకరించే స్త్రీ కోసం అంజలి అన్వేషిస్తున్న సమయంలో డాక్టర్ రాగా అందుకు ఒప్పుకుంటుంది. నిజానికి ఈ డాక్టర్ రాగా ఎవరో కాదు.. వరుణ్ ఎక్స్ లవర్. తాను చేసిన తప్పును దిద్దుకునేందుకే వరుణ్ బిడ్డను మోసేందుకు అంగీకరిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? తన బిడ్డను మోసేది తాను ప్రేమించిన అమ్మాయే అని తెలిసిన తర్వాత వరుణ్ రియాక్షన్ ఏంటి? రాగా, వరుణ్‌ల ప్రేమ వ్యవహారం అంజలికి ఎలా తెలిసింది? తెలిశాక పరిణామాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
చాలాకాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన కొత్త కథ ఇది. దూరమైన ప్రియురాలే, తాను ప్రేమించిన వ్యక్తి భార్యకు సరోగసీ ద్వారా బిడ్డను కనిపెట్టడం ఇంతవరకూ తెలుగుతెరపై రాలేదు. ఇంత కొత్తగా ఆలోచించిన దర్శకురాలు కోనా నీరజను మాత్రం కచ్ఛితంగా అభినందించాల్సిందే. కథ కొత్తది కావడంతో ఆటోమేటిగ్గా సన్నివేశాలన్నీ ఫ్రెష్‌గానే కనిపిస్తాయి. ఇప్పటివరకూ తెలుగుతెరపై చూడని ఓ వింత సంఘర్షణ ఈ సినిమాలో చూడొచ్చు. ముఖ్యంగా ప్రధమార్థం సినిమా చాలాబాగుంది. ప్రతి సన్నివేశాన్నీ కోనా నీరజ చాలా చక్కగా రాసుకున్నది. ముఖ్యంగా ఆమె రైటింగే సినిమాకు ప్రధాన బలం. ముగ్గురు వ్యక్తుల చుట్టూ అద్భుతమైన భావోద్వేగాలతో కథ సాగింది. విచిత్రమైన వ్యక్తిత్వాలు, తత్ఫలితంగా ఊహించని మలుపులు.. సాఫీగా సాగుతుందిలే అనుకునేలోపు అనుకోని ట్విస్ట్.. ప్రథమార్ధం ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది దర్శకురాలు కోనా నీరజా. ఇక ద్వితీయార్ధం హీరో పాత్రచిత్రణ సర్కాస్టిగ్గా అనిపిస్తుంది. కట్టుకున్న ఇల్లాలు ఒకవైపు.. తమ బిడ్డను తన కడుపులో మోస్తూ తన తప్పును దిద్దుకున్న ఎక్స్ లవర్ ఒకవైపు.. వీరిద్దరి విషయంలో కృతజ్ఞతాభావంతో ఉండాల్సిన హీరో వారిద్దరి దగ్గర సర్కాస్టిగ్గా బిహేవ్ చేస్తుంటాడు. అసలు తనెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అనే విషయాన్ని డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయలేకపోయారేమో అనిపిస్తుంది. అసలు హీరో మనసులో ఉద్దేశం ఏంటి? అనేది మనకు అర్ధం కాదు. భార్య అంటే ఇష్టం అంటాడు.. ఎక్స్ లవర్ని ఇంకా ప్రేమిస్తున్నానంటాడు. భార్య సమక్షంలోనే ఎక్స్ లవర్‌తో చనువుగా ఉంటాడు.. ఈ చర్యలన్నీ ఇబ్బందిగా అనిపిస్తాయి. అసలు ప్రధమార్థంలో చూపించిన కథకు కొనసాగింపు ఇది కాదేమో అనిపిస్తుంది ద్వితాయార్ధం చూస్తే. ఏదిఏమైనా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ముక్కోణపు ప్రేమకథలు మనం ఎన్నో చూశాం. కానీ ఇది విభిన్నమైన ముక్కోణపు ప్రేమకథ.
నటీనటులు
సిద్ధు ఎప్పటిలాగే తనదైన జోష్‌తో చెలరేగిపోయాడు. ఆద్యంతం అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. టిల్లూ స్కేర్‌కు ఇది పూర్తి భిన్నమైన పాత్ర. ఆ పాత్రకు తగ్గట్టు డిగ్నిటీగా, ైస్టెలిష్‌గా, సెటైరికల్‌గా, ఎమోషనల్‌గా తనలోని మంచి నటుడ్ని ఆవిష్కరించాడు సిద్ధు. ఇక రాశీఖన్నా తాను మంచి నటిని అని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా భర్త గురించి నిజం తెలిశాక, ఆ సంఘర్షణను ఆమె వ్యక్తపరిచిన తీరు చాలాబావుంది. ఇష్టం, కోపం, ప్రేమా అన్నింటినీ పలికించేందుకు అవకాశం ఉన్న పాత్ర రాశీఖన్నాది. ఇక శ్రీనిధి చాలా అందంగా ఉంది. తనది కూడా కథలో చాలా ఇంపార్టెంట్ రోల్. తన పాత్రలో కూడా ఎన్నో సంఘర్షణలుంటాయి. తాను కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. ఇక ఈ ఎమోషన్స్ మధ్య వైవా హర్ష ఆడియన్స్‌కి ఓ రిలీఫ్. కనిపించిన ప్రతిసారీ నవ్వించారు.
సాంకేతికంగా
కోనా నీరజ చాలా ైస్టెలిష్‌గా ఈ సినిమా తీశారు. మంచి కథ రాసుకున్నారు. డైలాగులు కూడా చాలా చక్కగా, శబ్దసౌందర్యంతో ఉన్నాయి. అయితే.. ద్వితీయార్ధం విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేదనిపించింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం నిజంగా సూపర్. జ్ఞానశేఖర్ ఓ అందమైన పెయింటింగ్‌లా ఈ సినిమాను మలిచారు. ఆయన ఛాయాగ్రహణం ఈ సినిమాకు ఓ ఎస్సెట్. సెకాండాఫ్‌లో ఎడిటింగ్ అవసరం అనిపించింది.
మొత్తంగా ‘తెలుసుకదా’ మంచి ఫీల్‌గుడ్ మూవీ. రెండున్నర గంటల ఓ ఎమోషనల్ జర్నీ. యూత్‌కే కాదు, సగటు ప్రేక్షకులకు కూడా నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.
బలాలు
కథ, ప్రథమార్ధం, సంభాషణలు, నటీనటుల నటన, సంగీతం, కెమెరా..
బలహీనతలు
ద్వితీయార్ధం, సెకాండాఫ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్..
రేటింగ్ : 3/5