Aditi Rao Hydari | ఈ ఏడాది మార్చిలో హీరో సిద్ధార్థ్, కథానాయిక అదితిరావు హైదరీల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. అదే ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని తాజా ఇంటర్వ్యూలో అదితిరావు హైదరీ చెప్పింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌తో తన ప్రేమ, పెళ్లి గురించి ఆమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
‘మహాసముద్రం’ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్‌తో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని చెప్పింది. హైదరాబాద్‌లో తన నాన్నమ్మ ప్రారంభించిన స్కూల్ అంటే ఎంతో ఇష్టమని, తన చిన్నతనం మొత్తం అక్కడే గడచిపోయిందని, అదే స్కూల్‌కి తీసుకెళ్లి సిద్ధార్థ్ తనకు లవ్‌ప్రపోజ్ చేశాడని అదితిరావు తెలిపింది.
పెళ్లి గురించి మాట్లాడుతూ ‘శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నాం. పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని అదితిరావు హైదరీ పేర్కొంది.