Uttar Pradesh investment fraud | ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో జరిగిన రూ.5 కోట్ల పెట్టుబడి మోసం (Investment Fraud) కేసులో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పాడే, అలోక్ నాథ్‌లతో సహా మొత్తం 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ది లోనీ అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ (The Loni Urban Multistate Credit and Thrift Cooperative Society Limited) అనే సంస్థ ప్రచారంలో భాగంగా ఈ నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా పాల్గొనడం వల్లే తాము నమ్మి పెట్టుబడులు పెట్టామని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాగ్‌పత్‌కు చెందిన బబ్లీ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ విచారణ చేపట్టారు. ఈ సొసైటీలో పెట్టుబడి పెడితే ఐదేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుందని హామీ ఇచ్చి, మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసం కారణంగా 500 మందికి పైగా సామాన్య ప్రజలు దాదాపు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించిన అనంతరం ఈ కంపెనీ 2024 నవంబర్‌లో అకస్మాత్తుగా తమ లావాదేవీల సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసి అధికారులు అదృశ్యమయ్యారు. ఇదే తరహాలో హర్యానాలోని సోనిపట్‌లో నమోదైన మరో మల్టీ-లెవల్ మార్కెటింగ్ మోసం కేసులో కూడా శ్రేయస్ తల్పాడే, అలోక్ నాథ్‌లు నిందితులుగా ఉన్నారు. ఆ హర్యానా కేసు విచారణ కొనసాగుతున్నందున సుప్రీంకోర్టు వీరిద్దరికీ మధ్యంతర అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ప్రస్తుతం బాగ్పత్ పోలీసులు నటుల పాత్రతో సహా అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.