పద్దెనిమిదేండ్ల తన సినీ కెరీర్లో ‘సైక్ సిద్ధార్థ’ ప్రత్యేక చిత్రమని, కథపై ఎంతో నమ్మకంతో సినిమా చేశామని, తన జడ్జిమెంట్ నిజమవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు చిత్ర హీరో నందు. ఆయన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. వరుణ్‌రెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం నందు విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యక్తి జీవితాన్ని ఇద్దరమ్మాయిలు ఏ విధంగా ప్రభావితం చేశారన్నదే ఈ సినిమా కథాంశమని, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని, న్యూఏజ్ ఫిల్మ్‌గా మెప్పిస్తుందని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘కథను చెప్పే విధానంలో ఇప్పటివరకూ ఉన్న మూస పద్ధ్దతుల్ని బ్రేక్ చేశాం.
స్టోరీలోని ఎమోషన్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో నా లుక్ చూసి అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. ఆ సినిమాతో ఎలాంటి సంబంధం ఉండదు’ అన్నారు. తాను సోలో హీరోగా నటిస్తున్న చిత్రమిదని, ఇది విజయం సాధిస్తే పదేళ్ల పాటు ఉత్సాహంగా సినిమాలు చేసే ధైర్యాన్నిస్తుందని నందు ఆశాభావం వ్యక్తం చేశారు. వెన్నెల కిషోర్, వైవా హర్షతో కలిసి తానో సినిమా చేస్తున్నానని, దానికి అనిల్ రావిపూడి దగ్గర రైటర్‌గా పనిచేసిన ప్రవీణ్ దర్శకత్వం వహిస్తారని, ఈ నెల 17న సినిమా లాంచ్ అవుతుందని నందు పేర్కొన్నారు.