Shraddha- Rahul | ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్త్రీ2 రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందంటూ కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య శ్రద్ధా కపూర్ రాహుల్‌తో తరచూ కనిపిస్తుండటం, కలిసి ట్రిప్స్‌కి వెళ్లడం, ఫోటోలు షేర్ చేయడం ఈ జంట మధ్య స్పెషల్ బాండింగ్ ఉందనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల శ్రద్ధా తన ఇంటి నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియోలో కూడా రాహుల్ కనిపించడంతో ఈ ప్రేమ కథ మరింత హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో వారిద్దరూ విమాన ప్రయాణం చేసిన సమయంలో, విమానంలోని ఒక ఎయిర్‌లైన్ సిబ్బంది రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది.
ఈ వ్యవహారం ఇండియా ఫోరమ్స్ ఇన్‌స్టా పేజీలో హాట్ టాపిక్‌గా మారింది. విమానంలో శ్రద్ధా – రాహుల్ సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించిన ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే అనుమతి లేకుండా ఇలా వీడియో తీయడం తగదు అంటూ సీనియర్ నటి రవీనా టాండన్ తీవ్రంగా స్పందించారు.ఇది వారి గోప్యతను ఉల్లంఘించడమే. సెలెబ్రిటీ అయినా, కాకున్నా ఇలాంటివి చేయడం దారుణం. ఎయిర్‌లైన్ సిబ్బంది మర్యాదలు నేర్చుకోవాలి. ఫోటో కావాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. రహస్యంగా వీడియో తీయడం విమాన సిబ్బంది నుండి ఊహించలేదు అంటూ రవీనా ఘాటు పోస్ట్ చేశారు.
ఇదే పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. కొంతమంది దీనిని ‘ఫ్యాన్ మూవ్మెంట్’గా సరదాగా తీసుకుంటున్నప్పటికీ, చాలా మంది ‘‘సిగ్గుండాలి.. ప్రైవసీకి భంగం కలిగించేలా ఇలా చేయడం సరైంది కాదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీనా టాండన్ అభిప్రాయానికి ఎక్కువ మంది మద్దతు పలికారు.ఈ ఘటనతో మరోసారి సెలెబ్రిటీల గోప్యత విషయంలో సామాజిక బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. అభిమానం అనేది కొంత వరకు బాగుంటుంది కానీ, హద్దులు దాటి ప్రైవసీకి భంగం కలిగిస్తే మాత్రం ఊరుకునేదే లేదంటున్నారు.