రచయిత, సహాయ దర్శకుడు రాహుల్ మోడితో నటి శ్రద్ధాకపూర్ అనుబంధంలో ఉన్నట్టు చాలా రోజులుగా బీటౌన్‌లో ప్రచారం జరుగుతున్నది. అతనితో కలిసి శ్రద్ధా దిగిన సెల్ఫీలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘తూ ఝూఠీ మై మక్కార్’ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని కథనాలు కూడా వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం ‘స్త్రీ 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రద్ధకు ఓ విలేకరి ద్వారా తన పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె తెలివిగా, ‘స్త్రీ 2’ చిత్రంలోని తన పాత్ర గురించీ, తన గురించీ ఒకే సమాధానం చెప్పేసింది. ‘స్త్రీ తనకు ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడ్ని పెళ్లిచేసుకుంటుంది.’ అంటూ సింపుల్‌గా తేల్చేసింది శ్రద్ధ. ఇక ఆమె తాజా సినిమా ‘స్త్రీ2’ విషయానికొస్తే, ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు.