“హిడింబ’ చిత్రం తర్వాత చాలా కథలు విన్నాను. యూనిక్ పాయింట్‌తో సినిమా చేయాలనుకున్నా. ఆ టైంలో ‘శివం భజే’ కధ విని చాలా ఎక్సైట్ అయ్యాను’ అన్నారు అశ్విన్ బాబు. ఆయన హీరోగా అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ‘శివం భజే’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్ ఉంటుంది.
ఇందులో నేను పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపిస్తా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదనే విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా నా పాత్ర ఉంటుంది. ఓ యాక్షన్ సినిమాలో డివైన్ పాయింట్ ఎలా కనెక్ట్ చేసారన్నది కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్. వికాస్ బడిస మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ శివేంద్ర విజువల్స్ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి’ అన్నారు. తను మంచి డ్యాన్సర్ అయినా ఇప్పటివరకు తెరపై ఆ ప్రతిభను కనబరిచే అవకాశం రాలేదని, ఈ సినిమాలో కథలో భాగంగా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కిందని అశ్విన్‌బాబు తెలిపారు. ‘రాజుగారి గది-4’ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అన్నయ్య ఓంకార్ కథను సిద్ధం చేస్తున్నారని, రెండు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయని అశ్విన్‌బాబు పేర్కొన్నారు.