శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందుమాధవి, మౌనికా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సామాజిక స్పృహను రేకెత్తించే కథాంశంతో టీజర్ ఆకట్టుకుంది.
ప్రేమకథ నేపథ్యంలో పల్లెల్లోని కుల వివక్ష, సామాజిక అంతరాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సర్పంచ్ పాత్రలో నవదీప్, వేశ్యగా బిందుమాధవి కనిపించారు. ‘హైదరాబాద్ పో..అమెరికా పో..యాడికైనా బో..చస్తే ఇడీకే తేవాలె’ అంటూ శివాజీ చెప్పిన డైలాగ్ కథలోని ఉద్వేగాన్ని తెలియజెప్పేలా ఉంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సందేశం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: మురళీకాంత్.