కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘వీర చంద్రహాస’. ‘కేజీఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ పతాకంపై ఎస్.ఎస్.రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని సాధించింది. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎంవీ రాధాకృష్ణ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ ‘ఇదొక రూటెడ్ స్టోరీ. యక్షగానం కల్చర్‌ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఇది నా పన్నెండేండ్ల కల. విజయం సాధించిన ప్రతి ఒక్కరి కథ ఇది. ఓ వ్యక్తి జీరో నుంచి హీరోగా ఎలా ఎదుగుతాడు అనే పాయింట్ ఈ కథలో ఉంటుంది. ఓ కొత్త ప్రపంచం ఈ సినిమాలో కనిపిస్తుంది.’ అని పేర్కొన్నారు. ఇటీవలే కన్నడంలో ఈ సినిమా వందరోజులు పూర్తి చేసుకున్నదని, తెలుగులో కూడా కచ్ఛితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత ఎం.వీ.రాధాకృష్ణ నమ్మకం వెలిబుచ్చారు. మరో నిర్మాత జేమ్స్ డబ్యూ కొమ్ము కూడా మాట్లాడారు.