పేదల పక్షపాతి, నిరాడంబర జీవితానికి నిదర్శనంలా నిలిచే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథ వెండితెరపైకి రాబోతున్నది. ఈ బయోపిక్‌లో కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
శనివారం పాల్వంచలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి గీతా శివరాజ్‌కుమార్ క్లాప్‌నివ్వగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివరాజ్‌కుమార్..ఓ గొప్ప మనిషి బయోపిక్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.
‘మా నాన్న కూడా గుమ్మడి నర్సయ్యలాగే ప్రజాసేవ చేసిన మనిషి. మనకోసం కాదు ఇతరుల కోసం బతకాలని ఎప్పుడూ చెబుతుండేవారు. ఇటీవల గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వస్తే మా నాన్న దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమా కోసం నేను తెలుగు నేర్చుకుంటా. సొంతంగా డబ్బింగ్ చెబుతా’ అని శివరాజ్ కుమార్ అన్నారు. రాజకీయం అంటే సామాజిక బాధ్యత అని గుర్తుచేసే చిత్రమిదని దర్శకుడు పరమేశ్వర్ పేర్కొన్నారు. వ్యవస్థతో పాటు మనందరిలో మార్పురావాలన్నదే తన ఆకాంక్ష అని గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, దర్శకుడు: పరమేశ్వర్ హివ్రాలే.