Shiva Jyothi | యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తించాయి. క్యూ లైన్లో నిలబడి “కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతూ ట్రోలింగ్‌కు దారితీశాయి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అలాంటి పదాలతో పేర్కొనడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఆమెపై ఒత్తిడి పెరిగింది. దీనిపై స్పందించిన శివజ్యోతి తాజాగా ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.
తాను మాట్లాడిన మాటలు తప్పుగా వెళ్లాయని ఒప్పుకున్న శివజ్యోతి, వీడియోలో మాట్లాడుతూ..“తిరుమల ప్రసాదం గురించి నేను చెప్పిన పదాలు చాలా మందికి బాధ కలిగించాయి. ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నిజంగా క్షమించండి. వివరణ ఇవ్వక ముందు ఇదే నా తొలి మాట. ‘రిచ్’ అని అన్నది రూ.10,000 ఎల్1 లైన్లో నిల్చున్నాం అనే ఉద్దేశంతో మాత్రమే. ‘కాస్ట్లీ లైన్’ అనేదాన్ని అలా మాట్లాడాను. కానీ నా ఇంటెన్షన్ అసలు అది కాదు” అని తెలిపారు. అలాగే, “నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు తెలుసు… వెంకటేశ్వర స్వామిపై నాకు ఉన్న భక్తి ఎంత బలమో. మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో నేను చేసే వ్రతాల వివరాలు సోషల్ మీడియాలో చెబుతున్నా. అవి ఎవరూ చూడలేదు… కానీ పొరపాటున వచ్చిన ఈ మాటలు మాత్రమే అందరికీ కనిపించాయి.
నా వైపు నుంచి, నా తమ్ముడు సోను వైపు నుంచి కూడా తప్పు జరిగింది. అతను అందుబాటులో లేడు… మా ఇద్దరి తరఫున అందరికీ క్షమాపణలు చెప్తున్నాను” అని స్పష్టం చేశారు. నా ఇంట్లో స్వామివారు ఉంటారు… నా చేతిపై కూడా వెంకటేశ్వర స్వామి టాటూ ఉంది. జీవితంలో నాకు అత్యంత విలువైన నా బిడ్డ కూడా ఆయన ప్రసాదమే. అలాంటి నేను స్వామివారి గురించి ఎప్పటికీ అగౌరవంగా మాట్లాడను. తెలియక పొరపాటున మాట తప్పింది. కేసుల భయంతో కాదు, నాకు కూడా అలా మాట్లాడకూడదనిపించింది. అందుకే ఈ వీడియో పెట్టాను” అంటూ శివజ్యోతి వీడియోలో పేర్కొన్నారు. ఆమె తాజా క్షమాపణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వివాదం కొంత చల్లార్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.