Shiva Re Release | భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలలో రామ్ గోపాల్ వర్మ ‘శివ’ ఒకటి అని బాలీవుడ్ దర్శకుడు జోధా అక్బర్, లాగాన్, స్వదేశ్ చిత్రాల ఫేమ్ అశుతోష్ గోవారికర్ అన్నారు. రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు అశుతోష్ కూడా ఈ మూవీపై మాట్లాడగా.. అన్నపూర్ఱ స్టూడియోస్ ఈ వీడియోను వదిలింది.
కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం మొత్తం ఇండస్ట్రీనే మార్చేస్తాయి. అలాంటి సినిమాలలో శివ ఒకటి. ఈ సినిమా విడుదలైన అనంతరం చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఈ సినిమా చూసిన అనంతరం అసలు ఈ సినిమా దర్శకుడు ఎవరని అందరూ వెతికారంటే ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎలా ఇలాంటి సినిమాను తెరకెక్కించాడని అందరూ తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకిల్ సీన్ కావచ్చు, ఇలాంటి చాలా సన్నివేశాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఇండియన్ సినిమానే మార్చిన ఈ చిత్రం నవంబర్ 14న 4K ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ విజయవంతం అవ్వాలని వర్మతో పాటు చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ అశుతోష్ చెప్పుకోచ్చాడు.