e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home సినిమా ఒక్కరు మారినా ఫలం దక్కినట్లే

ఒక్కరు మారినా ఫలం దక్కినట్లే

సున్నితమైన మానవోద్వేగాల్ని స్పృశిస్తూ.. సహజత్వం, వాస్తవికతల మేలికలయికగా ప్రేక్షకుల హృదయాల్ని స్పృశిస్తుంటాయి దర్శకుడు శేఖర్‌ కమ్ముల సినిమాలు. మానవ సంబంధాల్లోని సెన్సిబిలిటీస్‌ను అందంగా ఆవిష్కరించడం ఆయన శైలి. అలాగే సినిమాకు ఎంతోకొంత సామాజిక ప్రయోజనం ఉండితీరాలన్నది ఆయన నమ్మే సిద్ధాంతం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో శేఖర్‌కమ్ముల పాత్రికేయలతో పంచుకున్న ముచ్చట్లివి..

ప్రచార చిత్రాలు చూస్తుంటే మీ గత చిత్రాలకు భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్న భావన కలుగుతున్నది?
నా కెరీర్‌లో పెద్ద కాన్వాస్‌లో చేసిన తొలి సినిమా ఇది. నిమ్నవర్గాల నుంచి వచ్చిన ఓ అబ్బాయికి ఎదురయ్యే అసమానతలతో పాటు మహిళల పట్ల లింగ వివక్షను చర్చిస్తూ తెరకెక్కించాను. అంతర్లీనంగా అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది. ‘లీడర్‌’ చేస్తున్నప్పుడే ఎప్పటికైనా కుల సమస్యతో సినిమా తీయాలనుకున్నా. అది ఈ సినిమాతో కుదిరింది.

- Advertisement -

ఈ కథకు తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణమేమిటి?
సినిమా కథాగమనం, పాత్రలన్నీ తెలంగాణ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయి. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, పిప్రి అనే ప్రాంతాలకు చెందిన వారిగా నాయకానాయికలు కనిపిస్తారు. సొంత ఊరి నుంచి నగరానికి వచ్చిన వారు తమ కలల్ని ఎలా సాకారం చేసుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ యాస, నేటివిటీ సినిమాకు కొత్త శోభను తీసుకొచ్చింది.

సమాజంలో కుల, లింగ వివక్ష గురించి మీ అభిప్రాయమేమిటి? సినిమాలో ఆ అంశాన్ని ఎంతవరకు చూపించారు?
నేటి సమాజంలో కుల, మత అంతరాలు, అసమానతలు చాలా ఉన్నాయి. ఈ సమస్యల గురించి చెప్పడానికి సినిమా చక్కటి మాధ్యమమన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో కుల సమస్యను గురించి పూర్తిగా చూపించానని చెప్పడంలేదు. నాకు అవగాహన ఉన్న మేరకు ఆ సమస్యను సినిమాలో చర్చించాననుకుంటున్నా.

కొవిడ్‌ కారణంగా షూటింగ్‌తో పాటు సినిమా విడుదల ఆలస్యమైంది. ఆ సమయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది?
ముప్పై రోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుందనగా కొవిడ్‌ ఉధృతి మొదలైంది. లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్‌ను నిలిపివేశాం. ఏడాది విరామం తర్వాత ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా మేమే షూటింగ్‌ ప్రారంభించాం. యూనిట్‌ అందరికీ కరోనా పరీక్షలు చేసి, పీపీఈ కిట్స్‌ ఇచ్చి భౌతికదూరం పాటిస్తూ షూటింగ్‌ చేశాం. ఈ జాగ్రత్తల వల్ల నిర్మాణ వ్యయం మూడింతలైంది.షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదల చేయాలనుకున్న తరుణంలో సెకండ్‌వేవ్‌ మొదలైంది. థియేటర్స్‌ మూతపడటంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలో విడుదలచేశారు. మా నిర్మాతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు మాత్రం థియేటర్స్‌లోనే సినిమాను విడుదలచేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. మంచి విడుదల తేదీ కోసం చాలా ఎదురుచూశాం. ఈ క్రమంలో కథలో ఫ్రెష్‌నెస్‌ పోతుందా? పాయింట్‌ అవుట్‌డేట్‌ అవుతుందా? అనే భయాలు మొదలయ్యాయి. ఆ అవరోధాల్ని అధిగమించడం చాలెంజింగ్‌గా అనిపించింది.

నాగచైతన్యతో తెలంగాణ యువకుడి పాత్రను చేయించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?సాయిపల్లవి పాత్ర ఎలా ఉండబోతుంది?
నాగచైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.. ఇలాంటి ఛాయలున్న పాత్రను చైతన్య ఇప్పటివరకు చేయలేదు. పాత్రలో సహజత్వం కనిపించడానికి అతడి లుక్‌, మేనరిజమ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యను చూస్తారు. ‘ఫిదా’ సినిమాలో అల్లరి అమ్మాయిగా సాయిపల్లవి కనిపించింది. ఈ సినిమాలో తన మనసులోని భావాల్ని బయటకు వ్యక్తం చేయలేని అంతర్ముఖురాలిగా ఆమె కనిపిస్తుంది. ‘ఫిదా’ ప్రభావం తనపై లేకుండా ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేసింది.

సినిమాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా?
మంచి కథ చెప్పడమే దర్శకుడిగా నా బాధ్యత. అంతేకానీ నా సినిమా చూసి ప్రజలు మారుతారా? లేదా? అన్నది పట్టించుకోను. అట్టడుగు వర్గాలకు చెందిన యువకుడిని మెయిన్‌స్ట్రీమ్‌ హీరోగా చూపించడమే గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఆ పాత్రలో తమను తాము ప్రేక్షకులు చూసుకుంటే దర్శకుడిగా నేను విజయం సాధించినట్లే. తమ కథ చెప్పామనే ఆలోచన వారిలో కలిగిస్తే చాలనుకుంటున్నా. ఎవరో ఒక్కరు మారినా సినిమా రూపొందించినందుకు ప్రతిఫలం దక్కినట్టే.

తదుపరి సినిమా విశేషాలేమిటి?
ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ కథతో ఓ సినిమా చేయబోతున్నాం. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ తెరకెక్కించనున్నాం. వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానున్నది. ‘లీడర్‌’కు సీక్వెల్‌ను రూపొందించే ఆలోచన ఉంది. ఇందులోనూ రానా హీరోగా నటిస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement