రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. అలనాడు చక్కటి ప్రజాదరణ పొందిన ‘లేడీస్ టైలర్’లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. దాదాపు 37 ఏండ్ల విరామం తర్వాత ఈ సీనియర్స్ తిరిగి జోడీ కట్టడం విశేషం. పవన్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లిని చూడరు కాబట్టి..షష్టి పూర్తి ద్వారా భగవంతుడు ఆ లోటును తీర్చుకునే అవకాశం కల్పించాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సుందరమైన గోదావరి లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. కుటుంబ విలువలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, త్వరలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, దర్శకుడు: పవన్‌చంద్ర.