Sharwanand | చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘భోగి’ సెట్స్ నుంచి ఓ ఎమోషనల్ అప్డేట్ బయటకు వచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన షెడ్యూల్లో శర్వానంద్ పండించిన ఓ కీలక ఎమోషనల్ సీన్ చూసి తాను ‘కట్’ చెప్పడం కూడా మర్చిపోయానని దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గత పదేళ్లలో శర్వానంద్ ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదేనని, తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ సీన్స్‌లో ఇది ఒకటని సంపత్ నంది కొనియాడారు. ఆ సీన్ పూర్తయిన వెంటనే సెట్లో ఉన్న 200 మందికి పైగా యూనిట్ సభ్యులు ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ, కళ్లలో నీళ్లు తుడుచుకున్నారని ఆయన ఎమోషనల్‌గా తెలిపారు. దర్శకుడిగా తన కెరీర్లో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే మొదటిసారని, సెట్లోని వాతావరణం పూర్తిగా ఎమోషనల్‌గా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు తాను చెప్పిన ఈ మాటలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని, థియేటర్లలో ‘భోగి’ చూస్తున్నప్పుడు ఆడియెన్స్ కూడా కచ్చితంగా ఇదే ఎమోషన్‌కు, ఇదే ఫీల్‌కు గురవుతారని సంపత్ నంది గట్టి ధీమా వ్యక్తం చేశారు.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘భోగి’లో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని మాస్, రగ్డ్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్న సంపత్ నంది, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది.