‘జాను’ సినిమా టైమ్‌లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడి దయతో త్వరగా కోలుకున్నా. ఆ తర్వాత నేను బాగా బరువు పెరిగాను. శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో కొంచెం లావుగా కనిపించాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే నా లుక్ నాకే నచ్చలేదు’ అన్నారు హీరో శర్వానంద్. ఆయన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈ సందర్బంగా మంగళవారం శర్వానంద్ విలేకరులతో ముచ్చటించారు.
‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రానికి అనుకున్న ఫలితం రావడం ఆనందాన్నిచ్చింది. తొలిరోజు నుంచే ఈ సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. ఈ సంక్రాంతికి లాంగ్ వీకెండ్స్ కలిసొచ్చాయి. ఈ సినిమా విషయంలో మేము కంటెంట్‌ను బాగా నమ్మాం.
ఈ సినిమాలో నేను యంగ్ అండ్ స్లిమ్‌గా కనిపించా. ప్రమాదం జరిగిన కొన్నేళ్లకు నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. ఫిట్‌నెస్‌పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నా. యోగాతో పాటు డైటింగ్ చేశా. ఇప్పుడు నా లుక్ మారింది. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చాలా ైస్టెలిష్‌గా ఉన్నావని చెబుతున్నారు.
నా తదుపరి సినిమా ‘బైకర్’లో రెండు పాత్రల్లో కనిపిస్తా. అందులో ఫాదర్ రోల్ ఒకటి. సూర్య సన్నాఫ్ కృష్ణన్‌లో సూర్య పాత్రలా ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్స్ కోసం చాలా కష్టపడ్డాను. నిజానికి ‘బైకర్’ సినిమా ముందుగా రావాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది రాలేదు.
నేను ఏదో ఒక జోనర్‌కు పరిమితం అవ్వాలని కోరుకోవడం లేదు. ప్రతీ సినిమాలో కొత్తదనాన్ని ప్రదర్శించాలనే తపనతో ముందుకు వెళ్తున్నా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర కావడం ఓ దీవెనలా భావిస్తా. ‘బైకర్’ సినిమా షూటింగ్ అయిపోయింది. త్వరలో విడుదలవుతుంది. సంపత్‌నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా షూటింగ్ జరుగుతున్నది.