కర్ణాటక రాష్ట్రంలోని హళిబేడు ఆలయానికి సమీపంలోని గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ యిర్రంకి సురేష్ నిర్మించారు.
నవంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ‘గిరిజన తండాలో స్త్రీలను చెరబట్టి అకృత్యాలకు పాల్పడుతున్న ఓ కామాంధుడి బారి నుంచి విముక్తి పొంది జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ఓ యువతి కథ ఇది. సంగీతం, నాట్య ప్రధానంగా ఆకట్టుకుంటుంది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఓ యువతి చేసిన అవిశ్రాంత పోరాటం, చివరకు తన గమ్యాన్ని చేరుకున్న వైనం స్ఫూర్తివంతంగా ఉంటుంది. కర్ణాటక మారుమూల ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ‘సీతారామం’ ఫేమ్ విశాల్చంద్రశేఖర్ బాణీలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని చిత్ర బృందం పేర్కొంది.