యువతరంలో మంచి ఫాలోయింగ్ కలిగిన కథానాయకుల్లో షాహిద్‌కపూర్ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ తో నాలుగేళ్ల క్రితం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అయితే ఆ సినిమా అనంతరం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘బ్లడీ డాడీ’ చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
తన కెరీర్లో ‘జబ్ వి మెట్’ వంటి సూపర్‌హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఇద్దరి మధ్య కొన్ని కథా చర్చలు జరిగాయని, త్వరలో సినిమాను ఖరారు చేస్తామని చెప్పారు. ‘జబ్ వి మెట్’ తరహాలోనే హృద్యమైన ప్రేమకథతో ఈ సినిమా ఉండబోతుందని షాహిద్‌కపూర్ పేర్కొన్నారు.