బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీకిలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. తొలుత తన కుమారుడిని హీరోగానే చిత్రసీమకు పరిచయం చేద్దామని సన్నాహాలు చేశారు షారుఖ్‌ఖాన్. అయితే ఆర్యన్‌ఖాన్ దర్శకత్వం పట్ల అభిరుచి వ్యక్తం చేయడంతో నటుడిగా అరంగేట్రానికి కొన్నాళ్లు వేచిచూద్దామనే నిర్ణయానికొచ్చారు.
ప్రస్తుతం ఆర్యన్‌ఖాన్ సినీరంగం నేపథ్యంలో హిందీలో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతున్నారు. ఆరు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో ఔత్సాహిక నటీనటులు ఇండస్ట్రీలో ఎదుర్కొనే సమస్యల్ని చర్చించనున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు ‘స్టార్డమ్’ అనే పేరును ఖరారు చేశారు. షారుఖ్‌ఖాన్ స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.