Deool Band2 – SRK | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ‘కింగ్’ అనిపించుకున్నాడు. ఆయన చేసిన ఒక చిన్న సాయం, ఒక ప్రాంతీయ సినిమాను ఏకంగా రూ. 80 కోట్ల క్లబ్లో చేరేలా చేసింది. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ ఘన విజయం వెనుక షారుఖ్ ఖాన్ చూపిన ఉదారత, సినిమాపై ఆయనకున్న ప్రేమే కారణమని చిత్ర దర్శకుడు ప్రవీణ్ తార్డే తాజాగా వెల్లడించారు.
చిత్ర దర్శకుడు ప్రవీణ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్లలో ప్రదర్శించడానికి అవసరమైన డిజిటల్ సినిమా ప్యాకేజీ (DCP) బిల్లు సుమారు రూ. 42 లక్షలు అయింది. అయితే చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన మరాఠీ సినిమా కావడంతో, చిత్ర యూనిట్ అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేక తీవ్ర ఇబ్బందుల్లో పడింది. సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆశ ఉన్నా, చేతిలో డబ్బు లేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో మేము షారుఖ్ ఖాన్‌కు చెందిన ‘రెడ్ చిల్లీస్’ టీమ్‌ను సాయం కోరాం.
అయితే ఈ సమస్య షారుఖ్ ఖాన్ దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించారు. సినిమా వివరాలను అడిగి తెలుసుకుని, ఇది చాలా మంచి మరాఠీ సినిమా. ఆ రూ. 42 లక్షల బిల్లును పూర్తిగా మాఫీ చేయండి. వెంటనే DCP క్లియర్ చేసి సినిమా విడుదలకు సహకరించండి అని అధికారులను ఆదేశించారు. ఇక షారుఖ్ ఖాన్ చూపిన ఈ చొరవతో సినిమా సజావుగా విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన అనంతరం ‘దేవూల్ బంద్ 2’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 81.78 కోట్లు రాబట్టి, విజయవంతంగా రూ. 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది.
2015లో వచ్చిన సూపర్ హిట్ ‘దేవూల్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. సమాజంలో రైతు ఆత్మహత్యలు, విశ్వాసం-నాస్తికత్వం మధ్య జరిగే వైరుధ్యాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. స్నేహల్ తార్డే ప్రధాన పాత్ర పోషించగా, సీనియర్ నటుడు మోహన్ జోషి ‘స్వామి సమర్థ్’ పాత్రలో అలరించారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియని క్లిష్ట సమయంలో షారుఖ్ ఖాన్ చేసిన ఈ భారీ సాయాన్ని తాము ఎప్పటికీ మర్చిపోలేమని చిత్ర యూనిట్ ఎమోషనల్ అయింది. త్వరలోనే ఈ సినిమాను కింగ్ ఖాన్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించి, తమ కృతజ్ఞతలు తెలుపుకుంటామని వారు పేర్కొన్నారు.