మంగళవారం 26 మే 2020
Cinema - May 16, 2020 , 17:42:12

కరోనా అనుభవాలతో పుస్తకం రాస్తా: షారుఖ్‌ ఖాన్‌

కరోనా అనుభవాలతో పుస్తకం రాస్తా: షారుఖ్‌ ఖాన్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా గత 55 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ప్రజలు ఇండ్లకే పరిమితమైపోయారు. వ్యాపారాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరంలో బయటకు వెళ్లిన వారు ఇంటికి రాగానే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, కాళ్లు కడుక్కోవడం అనే అలవాటు వచ్చింది. ముక్కుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం  పాటించడం అనే కొత్త అలవాట్లు అలవడ్డాయి. ఇలా కరోనా కారణంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన అనుభూతులకు లోనవుతున్నారు.

తనకు కరోనా కాలంలో ఎదురైన అనుభవాలకు అక్షర రూపమిచ్చి పుస్తకంగా తీసుకొచ్చే పనిలో పడ్డారు బాలివుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌. కొవిడ్‌-19 కారణంగా గత 55 రోజులుగా సినిమా  షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమై కుటుంబసభ్యులతో గడుపుతున్నారాయన. ఈ కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వేళ తానెదుర్కొన్న అనుభవాలను 'ఓం శాంతి ఓం' పేరిట పుస్తకం రాసేందుకు పెన్నుపట్టినట్లు శనివారం ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'మనం మన అవసరాలకు మించి జీవిస్తున్నాం. వీటిలో చాలావరకు అనుకున్నంత ముఖ్యమైనవేవీ కావు. మనం లాక్‌డౌన్‌కు గురైనప్పుడు మాట్లాడాలని భావిస్తున్న వారికంటే మన చుట్టూ ఎక్కువ మంది అవసరం లేదు' అని అభిప్రాయపడుతున్నా అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొవిడ్‌-19 సమయంలో ప్రభుత్వానికి తన పరిధిలో సేవలందిస్తున్న షారుఖ్‌ ఖాన్‌.. తన అభిమానుల ఆధ్వర్యంలో అవసరార్ధులకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకొంటున్నారు.


logo