Nayanthara | ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నది అగ్ర కథానాయిక నయనతార. షారుఖ్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. విభిన్న గెటప్స్‌లో షారుఖ్‌ఖాన్ చేసిన యాక్షన్ విన్యాసాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార ఫస్ట్‌లుక్‌ను షారుఖ్‌ఖాన్ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.
‘తుఫాను ముందు ఉరిమే మేఘం ఆమె’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ను జత చేశారు. ఇందులో నయనతార చేతిలో తుపాకీ పట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నది. ఆమె లుక్స్ బాగున్నాయంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుఖ్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.