పఠాన్, జవాన్ చిత్రాలతో కెరీర్లోనే అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. ప్రస్తుతం ఆయన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ‘కింగ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజయ్‌ఘోష్ దర్శకత్వం వహిస్తారు. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది.
గతంలో ‘ది ఆర్చిస్’ చిత్రం ద్వారా ఓటీటీ వేదికపై ఆమె అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ‘కింగ్’ చిత్రంలో షారుఖ్‌ఖాన్ శిష్యురాలి పాత్రలో సుహానా ఖాన్ కనిపిస్తుందని, లక్ష్యసాధనలో ఆమెకు మార్గ దర్శనం చేసే గురువుగా షారుఖ్‌ఖాన్ పాత్ర సాగుతుందని తెలిసింది.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ తెలిపారు. యూరప్ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో షారుఖ్‌ఖాన్ పాత్ర శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ పాత్రలో నటించబోతున్నాడు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.