Jana Nayagan | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, తిరిగి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది.
అసలు వివాదం ఏమిటంటే.. ‘జన నాయగన్’ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇవ్వాలని జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డును ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు (CBFC) హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, అక్కడ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించారు. దీనివల్ల సినిమా విడుదల ఆలస్యమవుతుందని, నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టేను తొలగించేందుకు సిద్ధపడలేదు. అయితే, సినిమా ప్రాముఖ్యతను దృష్ట్యా ఈ నెల 20న ఈ కేసుపై కచ్చితంగా విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆదేశించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఈ నెల 20న హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే నెలకొన్నాయి. రాజకీయ ప్రస్థానానికి ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.