Senthil Kumar | టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య యోగా టీచర్ రూహి (Roohi) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యం(మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.
రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు ఆమె పని చేసింది. ఇక రూహి మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరుపనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వృత్తిరీత్యా సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు వచ్చాయి.