Rajendra Prasad : తెలుగు సినీ నటుల్లో చాలామంది ప్రముఖులకు రాజకీయాలతో సంబంధం ఉన్నది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఆయన ఎక్కడా పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత పెద్దగా రాజకీయ అంశాలను పట్టించుకోలేదు. అయితే ఆయన చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులు అందరికీ తెలుసు.
ఇక విషయానికి వస్తే.. ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే లక్ష్మీ పార్వతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఒక దరిద్రం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ దరిద్రం వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారని, ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌ను నాశనం చేశారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలకు అస్త్రంగా మారిన వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెద్దాయన (ఎన్టీఆర్) చనిపోయినపుడు ఆయన పిల్లల కంటే తానే ఎక్కువగా ఏడ్చానని చెప్పారు.
అప్పటి వీడియో చూస్తే తాను ఆయన భౌతికకాయం మీద పడి ఏడ్చిన దృశ్యాలు కనిపిస్తాయని అన్నారు. ఎందుకు అలా ఏడ్చాను అనేది ఇవాళ మొదటిసారి చెబుతున్నానంటూ చెప్పడం మొదలుపెట్టారు. ‘నా దృష్టిలో రామారావు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి, దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు. కానీ ఒక దశలో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆ దరిద్రం వచ్చిన తర్వాతే అంతా మారిపోయింది’ అన్నారు.
‘నాడు ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్లనే. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చారు. వాళ్లు బయటపడటంతోపాటు తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. నేను ఆవిడ గురించి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నిజానికి ఆవిడ మీద నాకు మర్యాద లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరిందని, ఆయనను తమకు లేకుండా చేసిందని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ దరిద్రం పేరును ప్రస్తావించడం కూడా తనకు ఇష్టం లేదని చెప్పారు. అప్పటి ఎన్నికల కవరేజీని చూస్తే ఆమెపై ఒంటి కాలిమీద లేచిన ముఖ్యమైన వ్యక్తుల్లో తాను ముందుంటానని అన్నారు.