సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పెద్దాడ మూర్తికి భార్య సంధ్య, కూతురు సుగాత్రి, కొడుకు అభిజీత్ ఉన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం ఆయన స్వస్థలం. విద్యార్థి జీవితం నుంచి సాహిత్యాభిలాష గల పెద్దాడ మూర్తి డిగ్రీ చదువుతూనే పతంజలి అనే పత్రికలో పాత్రికేయుడిగా పనిచేశారు. తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ‘కూతురు’ సినిమాతో గీత రచయితగా మారారు.
‘చందమామ’ సినిమాలో ‘బుగ్గే బంగారమా..’, ‘స్టాలిన్’ చిత్రంలో ‘సిగ్గుతో ఛీ ఛీ..’, ‘ఇడియట్’ సినిమాలో ‘చెలియా చెలియా..’, వంటి పాటలు ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి. పెద్దాడ మూర్తి మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు, సాహిత్యకారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ రాజీవ్‌నగర్‌లో బుధవారం జరగనున్నాయి.