జాతీయ అవార్డులపై బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి ఎంపికలో అవినీతి, లాబీయింగ్ ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. తాను నటించిన ‘సర్’ (1993), ‘సర్దార్’ (1993) చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయని, ఆ సమయంలోనే అవార్డుల ఎంపికలో అవకతవకల గురించి తెలుసుకున్నానని తెలిపారు.
అయితే తాను జాతీయ అవార్డులను గౌరవిస్తానని, ఎంపిక ప్రక్రియపై మాత్రం అభ్యంతరాలున్నాయని పరేష్ రావల్ అభిప్రాయపడ్డారు. ‘సినిమాలను జాతీయ అవార్డులకు పంపించే ముందు కొన్ని సాంకేతికాంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తులను సరిగ్గా పొందుపరచని పక్షంలో సినిమాలు తిరస్కరణకు గురవుతాయి. ఈ ప్రక్రియే గందరగోళంగా అనిపిస్తుంది.
ఆస్కార్ అవార్డుల్లోనే లాబీయింగ్ జరుగుతున్నప్పుడు, ఇక్కడి జాతీయ అవార్డుల్లో జరగడం పెద్ద విషయమేం కాదు.’ అని పరేష్ రావల్ అభిప్రాయ పడ్డారు. తన నటనను నసీరుద్దీన్‌షా, ఓంపురి వంటి లెజెండరీ యాక్టర్స్ మెచ్చుకున్న సందర్భాల్లో తాను జాతీయ అవార్డును గెలిచిన దానికంటే ఎక్కువగా ఆనందపడ్డానని, వారి మాటలకు ఏ అవార్డులూ సరితూగవని పరేష్ రావల్ పేర్కొన్నారు.