తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని కథానాయికగా పరిచయం చేస్తూ సీనియర్ హీరో అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ ఇందులో కీలక పాత్రధారులు. అర్జున్ ఓ ప్రత్యేకపాత్రలో నటించారు. అలాగే ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా ఇందులో ‘బసవన్న’గా మరో స్పెషల్ కామియోలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘సూరీడంటీ వాడొచ్చాడు సూడే.. మహా వీరుడల్లే కాపాడేది వీడే.. సూడే బసవన్నా.. వచ్చాడు సూడే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. నకాస్ అజిజ్.ఎల్. ఆలపించారు. కథ రీత్యా ఇందులో బసవన్న పాత్ర ఎంత ప్రధానమైనదో ఈ పాట తెలియజేస్తున్నది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న పానిండియా స్థాయిలో విడుదల కానున్నది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జి.బాలమురుగన్, నిర్మాణం: శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.