Savitri | మహానటి సావిత్రి తన అందంతోనే కాదు అమాయకత్వంతోను ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. సావిత్రికి ముందు, తర్వాత కూడా చాలామంది హీరోయిన్స్ వచ్చారు. కాని మహానటి అని అనిపించుకుంది ఒక్క సావిత్రి మాత్రమే. కథ ఏదైనా .. పాత్ర ఏదైనా సావిత్రి ఉంటే సినిమాకి ఓ నిండుదనం వస్తుంది.అప్పట్లో సావిత్రి తిరుగులేని కథానాయిక. ఎంతో ఇమేజ్ ఉన్నప్పటికీ, తన తోటి హీరోయిన్స్ తో సావిత్రి ఎంతో కలవిడిగా ఉండేది. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసేది. అయితే ఎంతో మొండిగే ఉండే సావిత్రి తన భర్త జెమినీ గణేషన్ తనని మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది. దాంతో మద్యానికి బానిసై కోమాలోకి వెళ్లింది. ఆరోగ్యం విషయంలో ముందే వైద్యులు హెచ్చరించినా డిప్రెషన్, ఆవేశంతో మద్యం ఎక్కువగా తీసుకుంటూ తుదిశ్వాస విడిచింది.
ఓ వెలుగు వెలిగిన సావిత్రి మరణించిన సమయంలో పెద్ద సెలబ్రిటీలు ఎవరూ ఆమెని కడసారి చూసేందుకు వెళ్లకపోవడం విచారకరం. అయితే సావిత్రి చివరి రోజుల్లో తనకి ఓ కోరిక ఉండేదట. అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న నందగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సావిత్రి చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట. మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లని విడవనక్కర్లేదు. ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలని ఉంచండి. ఇదే నాకు మీరిచ్చే గౌరవం అని సావిత్రి కోరుకున్నారట.
సావిత్రి చివరి కోరిక అదే కాగా, దానిని తన సమాధిపై రాసారా లేదా అనేది తెలియదు. సావిత్రి చివరి రోజులలో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే సావిత్రి అంత ఇబ్బంది పడుతుందని చాలా మందికి తెలియదట. ఎంతోమందికి ఎన్నో దానాలు చేసిన ఆమె, ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేదని టాక్. సావిత్రి జీవితంలో అమాయకత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. అమాయకుల చుట్టూనే తెలివైనవాళ్లు ఎక్కువ మంది చేరతారనే మాట నిజమనిపిస్తుంది. సావిత్రి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె పట్ల అభిమానం అణువంత కూడా తగ్గదు అని ఆమె అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.