సినిమా అంటే.. పెద్ద కాస్టింగ్! సినిమా అంటే.. భారీ సెట్స్! సినిమా అంటే.. నాలుగు పాటలు.. మూడు ఫైట్లు.. అదరగొట్టే పంచ్ డైలాగ్‌లు!! ఇవేం లేకుండా సినిమాను ఊహించలేమా? మరైతే, ఈ ‘సత్యం.. సుదరం’ ఎవరు?‘బావోయ్!!’ అంటూ కలుపుగోలుగా మాట్లాడుతూ ఒకరు..‘చెప్పు’ అని మొహమాటంగా మాట్లాడుతూ మరొకరు.. జస్ట్ ఇద్దరే!! ఎలాంటి ఆర్భాటాలూ లేవు.. పాటల్లేవ్.. ఫైట్లు అస్సల్లేవ్.. పేజీల కొద్దీ డైలాగులూ లేవు! ఓన్లీ ఇద్దరే.. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు!! అంతే.. !! సినిమా అయిపోయింది.. !! సూపర్ హిట్ అయిపోయింది!! ఇప్పుడెందుకు దాని గురించి అంటారా? ఓటీటీతో సత్యం.. సుందరం ఇంటింటికీ వెళ్లారు!! ఈ బావాబామ్మర్దులను.. ఇంటిల్లిపాదీ కూర్చుని చూస్తున్నారు!!
రొడ్డ కొట్టుడు సినిమాలకు అలవాటు పడిన మన ప్రేక్షకులు సాదాసీదా సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు.. ‘సత్యం.. సుందరం’ సమాధానమిచ్చింది. ఆ చిత్రాన్ని అందరూ చూశారు. చాలా శ్రద్ధగా చూశారు. సైలెంట్‌గా థియేటర్ల నుంచి బయటికొస్తూ ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు? ఎందుకంటే.. ఆ చిత్రంలో వాళ్లిద్దరు మాత్రమే మాట్లాడుకోలేదు!! థియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడితో మాట్లాడారు!! అడక్కుండానే కొన్ని ప్రశ్నలు వేశారు!
ఇలా సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులతో మాట్లాడటం చాలా అరుదు!! ఎప్పుడో ఒకసారి.. ఇలాంటి ప్రయత్నం జరుగుతుంటుంది. ‘అంబే శివం’ పేరుతో కమల్, మాధవన్ 20 ఏళ్ల క్రితమే ఈ తరహా ప్రయోగం చేశారు. ఈ తమిళ చిత్రం తెలుగులో ‘సత్యమే శివం’గా విడుదలైంది. ఇదీ ఆ కోవకు చెందిన సినిమానే! మన తనికెళ్ల భరణి తీసిన ‘మిథునం’ మరో అద్భుతం. రెండంటే.. రెండు పాత్రలతోనే.. జీవిత సారాన్ని పరిచయం చేశారు. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో ఎన్నో క్యారెక్టర్లు ఉండొచ్చు! కానీ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం పాత్రలు అలా గుర్తుండిపోయాయి. ఈ తరహా సినిమాలు పేరుతో కన్నా.. పాత్రలతోనే ఎక్కువగా గుర్తుండిపోతాయి. ఎందుకంటే.. ఆ రెండు పాత్రల మధ్య మాటలు, వాటి తాలూకు ఎమోషన్స్ ప్రేక్షకులను మాయలో పడేస్తాయి. అప్పుడు వెండితెర అద్దంలా మారిపోతుంది. ఆ పాత్రలు మన జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఎవరికి వారు బ్లర్‌గా కనిపిస్తారు. ఎందుకంటే.. అప్పటికే చెమర్చిన కళ్లకు దృశ్యం అస్పష్టంగానే గోచరిస్తుంది కదా!!
సినిమాకు ప్రత్యేకించి కొలమానాలు ఏం లేవు. వెండితెరపై ఎన్నో కథలు అలరిస్తాయి. వాటిలో కొన్ని కల్పితం.. కొన్ని వాస్తవ సంఘటనల సమ్మిళితం.. ఇంకొన్ని ఊహాతీతం.. ఇలా రకరకాలు. కథ ఏదైనా.. దాన్ని ముందుకు నడిపించేది పాత్రలే! చాలా పాత్రలు చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. కొన్నే సాదాసీదాగా కనిపించి.. విశేషంగా అలరిస్తాయి. ఇలా కామన్మ్యాన్తో కలిసిపోయే పాత్రలు ప్రేక్షకుడి మదిలో ఓ ముద్ర వేస్తాయి. తరాలు మారినా ఇది నిజం! లేదంటే.. మిలీనియల్స్ యుగం దాటి.. జెన్ జీలోకి వచ్చేశాం. అయినా.. మనలో ఇంకా ‘సత్యం. సుందరం’ అలానే ఉన్నారు. అందుకే కాబోలు.. అంతే ఎమోషనల్‌గా ఆ తరహా పాత్రలకు దగ్గరవుతున్నాం. వారు చెప్పింది వింటున్నాం. అలా కాకపోతే.. సుందరం ‘బావోయ్’ అన్న పిలిస్తే మనమెందుకు ఎమోషన్ అయ్యాం? సినిమా చివర్లో సత్యం ‘రేయ్.. పొటాటో’ అంటూ సుందరం కోసం ఆత్రంగా ఊరొస్తే ఎందుకు ఆనందపడిపోయాం? నేటి యాంత్రిక జీవితంలోకి అనుకోని అతిథుల్లా వచ్చిన ‘సత్యం.. సుందరం’ మనల్ని మనకు పరిచయం చేశారు. వెండితెరకు గౌరవం తెచ్చిపెట్టారు.
తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తారస్థాయిలో ఉన్న అరవింద స్వామి, వరుస విజయాలతో బిజీగా ఉన్న కార్తిక్.. ‘సత్యం.. సుందరం’గా కనిపించారంటే ఆ పాత్రలకు వారిచ్చిన ప్రాధాన్యం అలాంటిది. సూర్య, జ్యోతిక కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేయడం విషయం. తమిళంలో ‘96’ లాంటి సెన్సేషనల్ లవ్‌స్టోరీ తీసిన సి.ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ‘96’లోనూ రెండు పాత్రలతో కథను పెనవేసి, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు ఆయన. మరో విషయం ఏంటంటే.. సున్నితమైన ఎమోషన్స్ చూపిస్తూ.. ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం మామూలు విషయం కాదు. పెళ్లి మంటపంలో సత్యం తన మరదలితో మాట్లాడే సీన్ ఎంత చక్కగా ఉంటుందో! తన బాధలు చెప్పుకొన్న మరదలిని చూడటం.. వెళ్తూ వెళ్తూ ఆమె సత్యాన్ని లీలగా తాకడం.. అక్కడ ఆయనిచ్చే ఎక్స్ప్రెషన్.. అరవిందస్వామి నటనా అనుభవానికి మెచ్చు తునక. ఇక సుందరంగా కార్తిక్ హవభావాలతో బావపై ప్రేమ.. తను దాటొచ్చిన కష్టాల్ని చెబుతుంటే.. స్వచ్ఛమైన జీవితాన్ని గడపడానికి చాలా ధైర్యం కావాలని అనిపిస్తుంది. అలాంటి బంధువో.. బాల్య మిత్రుడో ఉంటే చాలనిపిస్తుంది.
60 ఏండ్ల వైవాహిక జీవితాన్ని అందంగా అందించిన కథ ‘మిథునం’. కేవలం రెండు పాత్రలతోనే చేసిన అసలు సిసలైన ప్రయోగం. కథకుడు రమణ రాసిన కథకు.. భరణి తీసిన మాయాజాలం ఈ సినిమా. ‘పిల్లలు ఖండాలు దాటేసినా.. మనకేం కాదు.. నాకు నువ్వు.. నీకు నేను..’ అనుకుంటూ మలి వయసులో పసి జంటలా అప్పదాసుగా బాలూ, బుచ్చిగా లక్ష్మి పండించిన నటనను ఎలా మర్చిపోతాం. వారి సంభాషణల్లో.. హావభావాల్లో.. చిక్కని సందేశం వినిపిస్తుంది. అందుకే ‘ఆది దంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునాన్ని..’ ప్రేక్షకులందరూ అభిమానించారు.
ఈ మధ్యే మెప్పించిన ‘రంగమార్తాండ’ మరో మంచి సినిమా. ఇద్దరు స్నేహితులు. రాఘవరావు, చక్రపాణి. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న కన్నవాళ్లని ఎలా చూసుకోవాలో, వాళ్లతో ఎలా మెలగాలో చెప్పే పిల్లల కథ. మొత్తంగా నేటి జీవితాల్ని ప్రతిబింబిస్తూ మనసుల్ని తడిచేసే ఓ హృద్యమైన కథ. నాటకరంగానికి చెందిన ఇద్దరు స్నేహితుల జీవితాల్లో ఎదురైన సంఘటనలు, సంభాషణలు.. వారి నిష్క్రమణ మర్చిపోగలమా? ‘అలసిపోయానురా.. ముక్తిని ప్రసాదిస్తావా? ’ అంటూ చక్రపాణి ఆడిగిన వైనం నిద్రలో కూడా వెంటాడుతుంది. కేవలం కథలోని పాత్రలే అవి.. కానీ, వెంటాడతాయ్. మనతో పాటు ఇంటికీ వచ్చేస్తాయ్. మర్చిపోలేని ఓ అతిథిగా మన జ్ఞాపకాల్లో నిక్షిప్తమవుతాయి!! పాన్ ఇండియా మూవీలు.. పెద్ద బడ్జెట్ సినిమాలు అంటూ ఓ చట్రంలో ఇరుక్కుపోకుండా మన పెద్ద హీరోలు కూడా ఈ తరహా సినిమాలకు పచ్చజెండా ఊపాలి. పెద్ద సినిమాల మధ్యలో ఓ చిన్న ఆటవిడుపులా కూడా ఈ తరహా పాత్రల్లో కనిపిస్తే కెరీర్‌కు కిక్ ఉంటుంది.
సమాజంలో ఇలాగే బతకాలి.. అదే లైఫ్ అంటూ.. గిరి గీసుకుని లైఫ్‌ని లీడ్ చేసేవాళ్ల.. అంతా దేవుడే చూసుకుంటాడనే మనిషి నమ్మకాల్ని ప్రశ్నిస్తూ వచ్చిన సినిమా ‘సత్యమే శివం’. కథ కమల్ హాసన్ అయితే, దర్శకుడు సుందర్.సి, మాధవన్ మాటలు అందించాడు. అనుకోని రీతిలో ఇద్దరు వ్యక్తులు కలవడం.. తర్వాత వారిద్దరి ప్రయాణం, చోటుచేసుకునే సంఘటలను, వాదోపవాదాలు.. ప్రేక్షకులకు ఎన్నో ప్రశ్నలు వేస్తాయి. ‘దేవుడు ఎక్కడో లేడు.. మనలోనే మనిషి రూపంలో ఉంటాడు. అప్పుడే మనిషికి మనిషే సాయపడతాడ’ని చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ సినిమా. ఈ చిత్రం విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా.. కమల్, మాధవన్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయ్.
– రాజేశ్ యడ్ల