సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో ‘రావు బహదూర్’ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ రానుంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకుడు. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్చంద్ర నిర్మాతలు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. నెమలి పించాలు, అల్లుకున్న తీగ చెట్లు, చిన్న చిన్న బొమ్మల మధ్య అరిస్టోక్రాటిక్ డ్రెస్‌లో ఉన్న సత్యదేవ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఓ రాజవంశం నేపథ్యంలో కథ నడుస్తుందని, భావోద్వేగాలతో కూడుకున్న చారిత్రాత్మక సంస్కృతిని ఇందులో చూడబోతున్నారని, గ్లోబల్ ఆడియన్స్ మెచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు వెంకటేష్ మహా తెలిపారు. ‘రావు బహదూర్ లాంటి పాత్రలు అరుదుగా దొరుకుతుంటాయి. మేకప్ కోసమే అయిదుగంటల సమయం పట్టేది. నేను కేవలం నటించలేదు.. నిజంగానే రావు బహదూర్లా బతికాను.’ అని సత్యదేవ్ చెప్పారు.
ఈ నెల 15న థియేటర్లలో ‘నాట్ ఈవెన్ ఎ టీజర్’ అనే స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నామని, ఈ నెల 18న ఆ వీడియో డిజిటల్లో వస్తుందని నిర్మాతలు తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ పానిండియా సినిమాకు కెమెరా: కార్తీక్ పర్మార్, సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటైర్టెన్మెంట్స్.