Satluj | సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, టైటిల్ వివాదాలు వంటి కారణాలతో సినిమాలు వాయిదా పడటం కొత్త విషయం కాదు. అయితే ఓటీటీలో విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్‌ను నిలిపివేయడం మాత్రం అరుదుగా జరిగే పరిణామం. ఇప్పుడు పంజాబీ స్టార్ నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజే ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ సినిమా ఇదే కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1990లలో పంజాబ్‌లో అదృశ్యమైన పలువురు వ్యక్తుల కేసులను పరిశోధించి కీలక ఆధారాలను వెలికితీసిన ఖల్రా, అనంతరం 1995లో హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని దర్శకుడు హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.
మొదట ఈ సినిమాకు ‘ఘల్లుఘరా’ అనే టైటిల్ ప్రకటించారు. అనంతరం దాన్ని ‘పంజాబ్ 95’గా మార్చగా, చివరికి ఓటీటీ విడుదల సమయంలో ‘సత్లుజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా 2022లోనే పూర్తయినప్పటికీ విడుదల మాత్రం సాధ్యం కాలేదు. కారణం సెన్సార్ వివాదాలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మొదట కొన్ని హింసాత్మక సన్నివేశాలు, సంభాషణలు, టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 21 మార్పులు సూచించింది. నిర్మాతలు ఆ మార్పులు చేసిన తర్వాత మళ్లీ సెన్సార్‌కు వెళ్లగా, ఈసారి ఏకంగా 127 కట్స్ సూచించినట్లు సమాచారం. అంతటి మార్పులు చేస్తే సినిమా అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని భావించిన చిత్రబృందం కోర్టును ఆశ్రయించింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యమైంది.
థియేటర్లలో విడుదలకు మార్గం సుగమం కాకపోవడంతో, చిత్రబృందం ఎలాంటి హడావుడి లేకుండా జూలై 3న జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా ‘సత్లుజ్’ను విడుదల చేసింది.ఈ సందర్భంగా హీరో దిల్జిత్ దొసాంజే స్పందిస్తూ.. ఓటీటీలో విడుదలైనది పూర్తిస్థాయి ఒరిజినల్ వెర్షనేనని, ఒకవేళ కట్స్ చేసి విడుదల చేసి ఉంటే తాను ఆ సినిమాను ప్రమోట్ కూడా చేసేవాడిని కాదని స్పష్టం చేశారు. అయితే విడుదలైన రెండు రోజులకే భారతదేశంలో జీ5 ప్లాట్‌ఫామ్ నుంచి సినిమా కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై స్పందించిన జీ5 యాజమాన్యం.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం ఉందని తెలిపింది. అయితే సినిమా తొలగింపుకు అసలు కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
భారతదేశంలో స్ట్రీమింగ్ నిలిపివేసినప్పటికీ, అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రం ‘సత్లుజ్’ జీ5లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీంతో భారత ప్రేక్షకులు ఈ సినిమా మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.