ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘శాసనసభ’. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమా మంచి ఆదరణ పొందుతున్నదని చిత్రబృందం చెబుతున్నారు. సోమవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ…‘మా సినిమా బాగుందంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇవాళ్టి నుంచి రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 60 థియేటర్స్ పెంచుతున్నాం. మౌత్ టౌక్ వల్లే మా సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్నది’ అన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…‘మంచి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. నా నట జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూశాను. ఈ చిత్రంలో నేను పోషించిన నారాయణస్వామి పాత్రకు మంచి స్పందన వస్తున్నది’ అన్నారు. దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ…‘ఇంద్రసేనను యాక్షన్ హీరోగా నిలబెట్టాలని నేను చేసిన ప్రయత్నం సఫలమైంది’ అన్నారు.